Saturday 3 December 2022

అవధి లేని చోటు

నేను నీ నుండి
ఆశించేదేమీ లేదు
గాలి పడమర దిశకు
మళ్ళినప్పుడెప్పుడైనా
అరుదుగా
తృప్తి-ఆనందాలతో
విస్ఫోటనం చెందిన
నీ నవ్వులు
తరంగాలుగా
లీలగా
నా చెవిని తాకుతుంటాయి

అప్పుడు
విప్పార్చిన కళ్ళతో నవ్వే
నీ ముఖం
నా మనోఫలకంపై
స్పష్టాతిస్పష్టంగా
ద్యోతకమవుతుంది
దూరపు భవంతిలో
చివరి అంతస్తులో
తెరల వెనుక
ఎప్పుడైనా
నీ ఆకృతి ఛాయలా, భ్రమలా
కదులుతూ కనిపిస్తుందనే
ఆశతో
నేను నిత్యం
రెప్పలు మూయకుండా
ఎదురు చూస్తుంటాను

రాత్రి నిశ్శబ్దంలో
నీ ఇంటి ఎదుట
తమాల వృక్షపు నీడల్లో
రేయిరేయంతా నిలబడి
హాయిగా నిదురిస్తున్న
నీ మెత్తని శ్వాసని వింటున్నట్టు
అనుభూతి చెందుతాను

తిరునాళ్ళలో
నిన్ను చూడడం కోసం
ఏడాదంతా ఎదురు చూస్తాను -
నీ భర్తతో, పిల్లలతో ఆనందంగా తిరిగే
నిన్ను చూడడం కోసం
నేను నీ నుండి ఆశించేదేమీ లేదు
అందుచేతనే
నా ఆనందానికి అవధి లేదు
నా దుఃఖానికి కూడా

Poem & Art : Sriram


 

No comments:

Post a Comment