Monday 19 December 2022

 

అవతార్ 2 - ఒక ధ్యానానుభవం

జేమ్స్ కెమెరాన్, టెరెన్స్ మాలిక్ లాగా గొప్ప తాత్వికుడు కాదు, జాంగ్ ఇమో లాగా గొప్ప టెక్నీషియన్ కాదు, పీటర్ జాక్సన్ లాగా సహజ కళాకారుడూ కాదు. గతంలో కాస్త నాణ్యత గల మాస్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ చిత్రాలు తీసిన దర్శకుడు మాత్రమే. గొప్ప సామర్థ్యాలు పుట్టుకతో వరంగా లభించని ఓమాదిరి దర్శకుడు మాత్రమే. అయితే అతడు మాస్టర్ గా ఎలా ఎదిగాడు?

 

 టెరన్స్ మాలిక్ వలె కెమెరాన్ 20 ఏళ్ళు అరణ్యాలలోకి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఏకాంతంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేదు. మరి అతడిలో spiritual inclination ఎందుకు, ఎలా కలిగిందో చెప్పడం కష్టం. బహుశా అతడిలోని తీవ్రమైన జిజ్ఞాస, అంకితభావం, ప్రకృతి పట్ల అతనికి ఉన్న ప్రేమ అతడిలోని పరిణతకు కారణం కావచ్చు. టైటానిక్ తర్వాత, ఇంకా చెప్పాలంటే అవతార్-1 లో, అతని కళలో కనిపించిన గొప్ప spiritual quality ని గమనించి ఆశ్చర్యపోయాను. ఒక జీవితంలో ఇంత గొప్ప ఎదుగుదల ఎలా సాధ్యం అనే ఆశ్చర్యం కలిగింది.

 

అవతార్-2 లో ధ్యానాత్మకమైన visuals లో, ఆ దృశ్యధారలో టెరెన్స్ మాలిక్ ముద్రను మనం చూస్తాం. జేమ్స్ కెమెరానే కాదు ఆధునిక దర్శకులలో masters ఎవరూ టెరెన్స్ మాలిక్ ప్రభావం నుండి తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే మాలిక్ గురువు. జ్ఞాని. అందరికీ.

 

అవతార్-2 సాధారణమైన కథే కావచ్చు. కానీ సాధారణమైన అనుభవం మాత్రం కాదు. సౌందర్య శక్తిని, ప్రకృతితో మనకున్న deep connection ని, spiritual connection ని లోతుగా అనుభవించేటట్టుగా, pristine and lucid visual తో, అవి visuals కాదు, మనం ఒక ఒక చేపలాగానో లేదా ఒక తిమింగలంలాగోనో ఒక జన్మని జీవించడం. సరిగ్గా ఒక కొత్త, మహత్తర లోకంలో జన్మని ఎత్తి ఒక జీవితాన్ని జీవించిన గొప్ప అనుభవాన్ని ఇస్తుంది ఈ చిత్రం.

 

మేధస్సును ఉపయోగించకుండా సౌందర్యానికి, అనుభూతికి  వశ్యులైతే చాలు. అదే అర్హత. అది ఒక్కటే. మీకు పండోరా లోకపు దివ్య కాంతి అనుభూతమవుతుంది. సున్నితమైన అతిలోక వర్ణాలు మీలోకి ఇంకిపోతాయి. నిజానికి కేమెరాన్ దృష్టిలో పండోరా అంటే సరిగ్గా మనం జీవిస్తున్న, నాశనం చేసుకుంటున్న మన భూమే. పండోరా అంటే ఈ భూమిని ఎంత అందంగా, ఎంత పవిత్రంగా, ఎంత సున్నితంగా మనం చూడాలో, ఈ భూమిపైన ప్రతి జీవరాశితోను మనం ఎటువంటి ప్రేమాస్పదమైన సంబంధాన్ని కలిగివుండాలో,  అలాగే ఏ జీవి మనకు భిన్నమైనది కాదనీ- ఈ లోకం, ఈ లోకంలోని సర్వజీవులూ, నువ్వూ-నేనూ ఒకటేననీ, వేరు కాదనీ - ఒక బలమైన, స్థిరమైన, శక్తివంతమైన అనుభవంగా మన హృదయాల్లో ఒక దర్శనంగా ఆవిష్కృతం కావడం. 

పండోరా ఒక ఆదర్శ లోకపు నమూనా కాదు. మనం జారవిడుచుకున్న సత్యం.  

ఈ చిత్రాన్ని ఒక కథగా చూసే వాళ్లకు కథ మాత్రమే కనిపిస్తుంది. విమర్శనాత్మక కోణంలో చూసేవాళ్లకు లోపాలు కనిపించవచ్చు. ఒక అనుభవంగా చూసే వాళ్లకు ఇది ఒక కాలాతీతమైన సత్యం. ఆది, అంతం లేని ప్రకృతిలో మనం ఉనికి లేకుండా కరిగిపోవడం. ఒక అమలిన ఆధ్యాత్మిక అనుభవం.

 ఇంకా ఎంతో ఉదాత్తమైన కథలో ఈ చిత్రాన్ని తీసివుండొచ్చు. తీస్తే ప్రజలు చూస్తారా అనేదే సందేహం.  అత్యంత భారీ చిత్రం కాబట్టి వ్యాపార విలువలు అనివార్యం. అక్కడికీ సున్నితమైన సన్నివేశాలకు కోత పడకుండా కాపాడుకోవడం కోసం స్టూడియోలతో కేమెరాన్ పోరాడవలసివచ్చింది.

కెమెరూన్ అవతార్ ని ఎంచుకున్నదే ప్రకృతిని కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని, ఇప్పటికే సమయం మించి పోయింది అనే విషయాన్ని బలంగా ప్రజల హృదయాల్లోకి చొప్పించాలని నిర్ణయించుకోవడం వల్లనే జరిగింది. అందువల్లనే అతను వేరే ప్రాజెక్టుల్ని పక్కనపెట్టి అవతార్ ని వీలైనన్ని ఎక్కువ భాగాలుగా తీయాలని తపిస్తున్నాడు. గొప్ప శక్తి, గొప్ప బాధ్యతను ఇస్తుంది. అత్యంత శక్తివంతమైన, ప్రభావంతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టే తన ఉనికి కారణమైన ప్రకృతిని కాపాడుకోవాలని నిబద్ధతతో ప్రయత్నిస్తున్నాడు. చాలా మంది అనుకుంటున్నట్టు అవతార్ franchise ని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం కెమెరాన్ కి లేదు.   

 మనిషి యొక్క మూలాల్ని అనితర సాధ్యమైన సాంకేతికతతో అనుభవైకవేద్యం చేస్తున్నాడు. గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు కాబట్టే సందేశం బలంగా ప్రజలకు అందే వీలు ఉంటుంది. ఇప్పుడున్న అపసవ్యమైన లోకరీతులకి అద్దం పట్టడమే కాకుండా పరిష్కారాల్ని చూపుతుంది ఈ చిత్రం. ప్రపంచాన్ని వినాశనం చేసున్న పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్ఞవాదం, వలసవాదం, ఆక్రమణవాదం, వ్యాపార సంస్కృతి వంటి ఆధునిక చీకటి విలువలకు వ్యతిరేకంగా ఒక కళాకారుడు పూరించిన సమర శంఖం ‘అవతార్’. కార్పోరేట్ శక్తులు అవతార్ ని బహిరంగంగానే  విమర్శించాయి. గర్హించాయి. ఈ చిత్ర విజయాన్ని చూసి నొచ్చుకున్నాయి. బలవంతుల దోపిడీకి గురయ్యో ప్రతి వ్యక్తి హృదయానికి అవతార్ చేరువలో ఉంటుంది. తన ఇంటిని, నేలను, ఉనికిని కోల్పోతున్న ప్రతి వ్యక్తికి అవతార్ అర్థమవుతుంది.              

 మేధోపరమైన చర్చలకు ఆస్కారం లేకుండా సూటిగా, సరళంగా అందరికీ - ఇక్కడ అందరికీ అంటున్నానంటే నిజంగానే ఈ భూమిపై జీవించే అందరికీ - అర్థ మయ్యేంత సరళ మైన భాషలో కెమెరాన్ సందేశం అందించగలిగాడు. అవతార్ ని న్యూయార్క్ నుండి విశాఖ అడవుల్లోని మారుమూల గూడెం గిరిజనుల వరకూ ప్రతి ఒక్కరూ చూస్తారు. ప్రేమిస్తారు. ఎందుకు? వారికి ఏదో అర్థమవుతుంది, అందాల్సింది అందుతుంది, రహస్య సందేశం.  


No comments:

Post a Comment