Sunday 4 December 2022

 


పరమ మార్గం 

అభిప్రాయాల ఉచ్చులో చిక్కుకోనివారికి

పరమ మార్గమేమంత కష్టంకాదు

రాగద్వేషాలపట్ల ఉదాశీనతగలవారికి సర్వమూ విదితమవుతుంది


భూమ్యాకాశాలనడుమ దూరం అనంతమైనా

నీవు ఏకత్వాన్ని దర్శించగలవా?

సత్యం ఆవిష్కృతమవాలంటే

నిశ్చితమైన అభిప్రాయాలను విడనాడు


ఇష్టాయిష్టాల భేదభావం మానసిక అస్వస్థతకు చిహ్నం

విషయాల పరమార్థాన్నిగ్రహించలేనివారి

మనసులోని శాంతి చెదిరిపోతుంది


అనంతమైన చోటులో

ఏదీ లోపించనట్టుగానూ

ఏదీ అతిశయించనట్టుగానూ

మార్గం విస్పష్టంగా ఉంది

ఎంపిక, తిరస్కారాల మూలంగా

మనం విషయాల యదార్థ తత్వాన్ని గ్రహించలేకున్నాము


ఐహిక విషయాల చిక్కుల్లో జీవించవద్దు

అలాగే అంతరిక భావాల శూన్యతలోనూ జీవించవద్దు

ఏకత్వంలో నిశ్చలంగా నిలచిఉండు


పరమమార్గంలో జీవించడం

అంత సులభంకాదు

అలాగని కష్టమూ కాదు

కాని నిశ్చితాభిప్రాయాలు గలవారికది భీతావహం...అగమ్యగోచరం


వేగంగా పయనించాలని ఆతృతపడేవారు నిజానికి నెమ్మదిగా పయనిస్తారు

వారిని బంధనాలు బాధిస్తాయి

ఆఖరికి నిర్వాణమనే భావనపట్ల మమకారాన్ని పెంచుకోవడం కూడా

నిన్ను దారి తప్పేలాచేస్తుంది


Poet: Wu Pen (Chia Tao,779-841)

అనుసృజన, ఛాయాచిత్రం: శ్రీరామ్


No comments:

Post a Comment