Monday 19 December 2022

 

అవతార్ 2 - ఒక ధ్యానానుభవం

జేమ్స్ కెమెరాన్, టెరెన్స్ మాలిక్ లాగా గొప్ప తాత్వికుడు కాదు, జాంగ్ ఇమో లాగా గొప్ప టెక్నీషియన్ కాదు, పీటర్ జాక్సన్ లాగా సహజ కళాకారుడూ కాదు. గతంలో కాస్త నాణ్యత గల మాస్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ చిత్రాలు తీసిన దర్శకుడు మాత్రమే. గొప్ప సామర్థ్యాలు పుట్టుకతో వరంగా లభించని ఓమాదిరి దర్శకుడు మాత్రమే. అయితే అతడు మాస్టర్ గా ఎలా ఎదిగాడు?

 

 టెరన్స్ మాలిక్ వలె కెమెరాన్ 20 ఏళ్ళు అరణ్యాలలోకి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఏకాంతంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేదు. మరి అతడిలో spiritual inclination ఎందుకు, ఎలా కలిగిందో చెప్పడం కష్టం. బహుశా అతడిలోని తీవ్రమైన జిజ్ఞాస, అంకితభావం, ప్రకృతి పట్ల అతనికి ఉన్న ప్రేమ అతడిలోని పరిణతకు కారణం కావచ్చు. టైటానిక్ తర్వాత, ఇంకా చెప్పాలంటే అవతార్-1 లో, అతని కళలో కనిపించిన గొప్ప spiritual quality ని గమనించి ఆశ్చర్యపోయాను. ఒక జీవితంలో ఇంత గొప్ప ఎదుగుదల ఎలా సాధ్యం అనే ఆశ్చర్యం కలిగింది.

 

అవతార్-2 లో ధ్యానాత్మకమైన visuals లో, ఆ దృశ్యధారలో టెరెన్స్ మాలిక్ ముద్రను మనం చూస్తాం. జేమ్స్ కెమెరానే కాదు ఆధునిక దర్శకులలో masters ఎవరూ టెరెన్స్ మాలిక్ ప్రభావం నుండి తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే మాలిక్ గురువు. జ్ఞాని. అందరికీ.

 

అవతార్-2 సాధారణమైన కథే కావచ్చు. కానీ సాధారణమైన అనుభవం మాత్రం కాదు. సౌందర్య శక్తిని, ప్రకృతితో మనకున్న deep connection ని, spiritual connection ని లోతుగా అనుభవించేటట్టుగా, pristine and lucid visual తో, అవి visuals కాదు, మనం ఒక ఒక చేపలాగానో లేదా ఒక తిమింగలంలాగోనో ఒక జన్మని జీవించడం. సరిగ్గా ఒక కొత్త, మహత్తర లోకంలో జన్మని ఎత్తి ఒక జీవితాన్ని జీవించిన గొప్ప అనుభవాన్ని ఇస్తుంది ఈ చిత్రం.

 

మేధస్సును ఉపయోగించకుండా సౌందర్యానికి, అనుభూతికి  వశ్యులైతే చాలు. అదే అర్హత. అది ఒక్కటే. మీకు పండోరా లోకపు దివ్య కాంతి అనుభూతమవుతుంది. సున్నితమైన అతిలోక వర్ణాలు మీలోకి ఇంకిపోతాయి. నిజానికి కేమెరాన్ దృష్టిలో పండోరా అంటే సరిగ్గా మనం జీవిస్తున్న, నాశనం చేసుకుంటున్న మన భూమే. పండోరా అంటే ఈ భూమిని ఎంత అందంగా, ఎంత పవిత్రంగా, ఎంత సున్నితంగా మనం చూడాలో, ఈ భూమిపైన ప్రతి జీవరాశితోను మనం ఎటువంటి ప్రేమాస్పదమైన సంబంధాన్ని కలిగివుండాలో,  అలాగే ఏ జీవి మనకు భిన్నమైనది కాదనీ- ఈ లోకం, ఈ లోకంలోని సర్వజీవులూ, నువ్వూ-నేనూ ఒకటేననీ, వేరు కాదనీ - ఒక బలమైన, స్థిరమైన, శక్తివంతమైన అనుభవంగా మన హృదయాల్లో ఒక దర్శనంగా ఆవిష్కృతం కావడం. 

పండోరా ఒక ఆదర్శ లోకపు నమూనా కాదు. మనం జారవిడుచుకున్న సత్యం.  

ఈ చిత్రాన్ని ఒక కథగా చూసే వాళ్లకు కథ మాత్రమే కనిపిస్తుంది. విమర్శనాత్మక కోణంలో చూసేవాళ్లకు లోపాలు కనిపించవచ్చు. ఒక అనుభవంగా చూసే వాళ్లకు ఇది ఒక కాలాతీతమైన సత్యం. ఆది, అంతం లేని ప్రకృతిలో మనం ఉనికి లేకుండా కరిగిపోవడం. ఒక అమలిన ఆధ్యాత్మిక అనుభవం.

 ఇంకా ఎంతో ఉదాత్తమైన కథలో ఈ చిత్రాన్ని తీసివుండొచ్చు. తీస్తే ప్రజలు చూస్తారా అనేదే సందేహం.  అత్యంత భారీ చిత్రం కాబట్టి వ్యాపార విలువలు అనివార్యం. అక్కడికీ సున్నితమైన సన్నివేశాలకు కోత పడకుండా కాపాడుకోవడం కోసం స్టూడియోలతో కేమెరాన్ పోరాడవలసివచ్చింది.

కెమెరూన్ అవతార్ ని ఎంచుకున్నదే ప్రకృతిని కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని, ఇప్పటికే సమయం మించి పోయింది అనే విషయాన్ని బలంగా ప్రజల హృదయాల్లోకి చొప్పించాలని నిర్ణయించుకోవడం వల్లనే జరిగింది. అందువల్లనే అతను వేరే ప్రాజెక్టుల్ని పక్కనపెట్టి అవతార్ ని వీలైనన్ని ఎక్కువ భాగాలుగా తీయాలని తపిస్తున్నాడు. గొప్ప శక్తి, గొప్ప బాధ్యతను ఇస్తుంది. అత్యంత శక్తివంతమైన, ప్రభావంతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టే తన ఉనికి కారణమైన ప్రకృతిని కాపాడుకోవాలని నిబద్ధతతో ప్రయత్నిస్తున్నాడు. చాలా మంది అనుకుంటున్నట్టు అవతార్ franchise ని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం కెమెరాన్ కి లేదు.   

 మనిషి యొక్క మూలాల్ని అనితర సాధ్యమైన సాంకేతికతతో అనుభవైకవేద్యం చేస్తున్నాడు. గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు కాబట్టే సందేశం బలంగా ప్రజలకు అందే వీలు ఉంటుంది. ఇప్పుడున్న అపసవ్యమైన లోకరీతులకి అద్దం పట్టడమే కాకుండా పరిష్కారాల్ని చూపుతుంది ఈ చిత్రం. ప్రపంచాన్ని వినాశనం చేసున్న పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్ఞవాదం, వలసవాదం, ఆక్రమణవాదం, వ్యాపార సంస్కృతి వంటి ఆధునిక చీకటి విలువలకు వ్యతిరేకంగా ఒక కళాకారుడు పూరించిన సమర శంఖం ‘అవతార్’. కార్పోరేట్ శక్తులు అవతార్ ని బహిరంగంగానే  విమర్శించాయి. గర్హించాయి. ఈ చిత్ర విజయాన్ని చూసి నొచ్చుకున్నాయి. బలవంతుల దోపిడీకి గురయ్యో ప్రతి వ్యక్తి హృదయానికి అవతార్ చేరువలో ఉంటుంది. తన ఇంటిని, నేలను, ఉనికిని కోల్పోతున్న ప్రతి వ్యక్తికి అవతార్ అర్థమవుతుంది.              

 మేధోపరమైన చర్చలకు ఆస్కారం లేకుండా సూటిగా, సరళంగా అందరికీ - ఇక్కడ అందరికీ అంటున్నానంటే నిజంగానే ఈ భూమిపై జీవించే అందరికీ - అర్థ మయ్యేంత సరళ మైన భాషలో కెమెరాన్ సందేశం అందించగలిగాడు. అవతార్ ని న్యూయార్క్ నుండి విశాఖ అడవుల్లోని మారుమూల గూడెం గిరిజనుల వరకూ ప్రతి ఒక్కరూ చూస్తారు. ప్రేమిస్తారు. ఎందుకు? వారికి ఏదో అర్థమవుతుంది, అందాల్సింది అందుతుంది, రహస్య సందేశం.  


Monday 5 December 2022

 మరపు


నువ్వు నా నుండి 

దూరమైనప్పుడల్లా 

నేను చెయ్యగలిగింది 

ఏముంది

ఇంకొంచెం నీకు

దూరమవడం తప్ప


నేను దూరమైనప్పుడల్లా 

నువ్వు ఎలాగూ ఇంకొంత

దూరమవుతావు

నేను దగ్గరవ్వాలనుకున్నప్పుడల్లా

మరింత దగ్గరతనాన్ని కోల్పోతావు


అందుచేతనే 

నేను దగ్గరవడం కంటే 

దూరమవడం కోసం 

ప్రయత్నించడంలోనే 

నీకు ఎక్కువ దగ్గరవుతున్నట్టు

అనుభూతి చెందుతారు 


చివరికి 

మనం 

ఒకరికొకరం

ఎంతగా దూరమైపోతామంటే

ఒకప్పుడు 

మనం కలిసి ఉన్నామన్న 

విషయమే 

మర్చిపోయేంతగా


కాని ఆ మరపు 

వరంగా

మనలో 

ఒక్కరికే లభిస్తుంది 


కవిత, చిత్రం: శ్రీరామ్


Sunday 4 December 2022


 Curse of Mundane

మహాసముద్రపు అమేయమగు
శక్తి ముందు
శిరస్సు వంచి ప్రణమిళ్ళని
నక్షత్రఖచిత ఆకాశం కింద
అశాంతి నిండిన మనసుని
పరచి సేదతీరని
వృక్షాల ప్రేమను స్వీకరించి
చేతన సాంతం
నింపుకోని
పర్వతాల అలౌకిక గాంభీర్యానికి
వశపడని
మబ్బులని
వెన్నెలని
పక్షుల కిలకిలారావాలని
అనుభూతి చెందని
పసిపిల్లల ప్రేమాస్పదమైన
వదనాల్ని
చూసి సాంత్వన పొందని
ఈ లోకపు ప్రతి అద్భుతానికి
విస్మయం చెందని
ప్రతి దినాన్ని
శపించు
నా జీవితం నుండి నిషేదించు
మేకులు కొట్టబడిన
శవ పేటికలోని
పురుగుల లుకలుకవలె సాగే
సాదాసీదా
రోజువారీ సంక్షుభిత జీవితంతో
సంతృప్తి చెంది
జీవితపు ప్రతి క్షణాన్ని
నిబిడాశ్చర్యంతో
వీక్షించలేని
స్వీకరించలేని
అంధజీవితంలోని
మామూలుతనం
నుండి
బయట పడే
దైర్యాన్ని, తెగువని, సంకల్పాన్ని
నాకివ్వు
కవిత, ఛాయాచిత్రం : శ్రీరామ్
Shanthi Ishaan, Naagini Kandala and 21 others
5 comments
Like
Comment
Share


సాహసనారి లేడీ గలాద్రియెల్


ప్రపంచవ్యాప్తంగా Galadriel పాత్ర పట్ల Trolls విరుచుకుపడుతున్నారు. Trolls దాడిని తట్టుకోలేక అమెజాన్ ప్రైమ్ వీడియో తన comments service ని కొన్ని రోజులు పాటు మూసివేసింది. పెద్ద ఎత్తున జాతి విద్వేషపూరిత దాడులు social media లో ఒక విషతుల్యమైన వాతావరణాన్ని సృష్టించాయి.

The Lord of the Rings Trilogy, The Hobbit Trilogy లలో Cate Blanchett నటించిన Lady Galadriel పాత్ర కు సరిసాటిగా The Rings of Power లోని Morfydd Clark నటించిన యువ Galadriel పాత్ర లేదని విమర్శిస్తున్నారు.

ఎలాన్ మస్క్ అయితే Galadriel తప్ప The Rings of Power లోని పురుషులందరూ వెన్నెముక లేనివారు లేదా పిరికివారు అని tweet పెట్టాడు. వ్యాపారంలో జెఫ్ బెజోస్ తో ఉన్న శత్రుత్వం దానికి కారణం కావచ్చు. ప్రత్యర్థి అయిన ఆపిల్ సంస్థను కూడా అటువంటి ట్వీట్లతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం ఎలాన్ మస్క్ కి అలవాటే.
Calmness అనేది చాలా expensive thing. ఒకరు స్థితప్రజ్ఞత సాధించడం ఎన్నో ఎదురుదెబ్బలు, పొరపాట్లు, ఓటముల తరువాతే జరుగుతుంది. అపరిపక్వతలో సంభవించే చేదు ఫలితాల్ని చవిచూసాకే పరిపక్వత లభిస్తుంది. Lady Galadriel స్థితప్రజ్ఞత, దివ్యత్వం, composed and matured persona ఒక్క రోజులో రాలేదు.
Galadriel పాత్ర పట్ల ప్రేమ Tolkien కి 40 ఏళ్ల సుదీర్ఘ రచనా కాలంలో పెరుగుతూ వచ్చింది, అలాగే Tolkien యొక్క స్వీయ పరిపక్వత కూడా. అది Galadriel వ్యక్తిత్వంలో ప్రతిఫలించింది, ఎన్నో వందల సంవత్సరాలు జీవించిన ఆమె అనుభవ జ్ఞానం అది.

అలాగని యువ Galadriel కి Lady Galadriel కి నడుమ contradiction లేదా అంటే ఖచ్చితంగా ఉంది. నిజాయితీతో కూడిన adacity నుండి calmness లోకి సాగించే ప్రయాణమే Galadriel పాత్ర.
ఇక ఎలాన్ మస్క్ విషయానికి వస్తే జీవితంలో ప్రతి ఒక్కరికీ వారు నిర్వహించాల్సిన పాత్ర ఒకటి ఉంటుంది అని Tolkien's philosophy చెబుతుంది. ఎవరి పాత్రను వారు అత్యుత్తమంగా సర్వశక్తులను వినియోగించి నిర్వహిస్తేనే జీవన సాఫల్యం అంటుంది.

అందరూ Galadriel కాలేరు. ఎలాన్ మస్క్ కాలేరు. జీవితం కాని, కథ కాని అలా ఉండదు. ఒక ఎలాన్ మస్క్ పాత్ర ఎందరో వ్యక్తుల శ్రమతో ఏర్పడింది. ఒక శ్రామికుడు లేదా సైనికుడి కష్టం రాజు కష్టం కన్నా తక్కువ కాదు. ఎవరి పాత్రను వారు నిర్వహిస్తేనే సృష్టిలో సమతులిత అంటుంది Tolkien సాహిత్యం.
Tolkien యొక్క ప్రపంచంలో అనేక జాతుల వారు ఉమ్మడి లక్ష్యం కోసం తమ వంతు పాత్రను తాము నిర్వహిస్తారు. అదే fellowship కి అర్థం. ఇక్కడ racism కి తావే లేదు.

దర్శకుడు Peter Jackson కి మాత్రమే సాధ్యంకాగల కళాత్మక మాధుర్యంతో ఇతిహాస స్థాయిని అందుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అతను తన బాల్యం నుండి Tolkien యొక్క కాల్పనిక సాహిత్య ప్రపంచంలోకి పలాయితుడై, దానినే శ్వాసిస్తూ ఎదిగిన మహా కళాకారుడు. అయితేనేం The Rings of Power విజయవంతంగా Middle Earth ఆత్మని నిలుపుకోగలిగింది. సంగీతం, దర్శకత్వం, నిర్మాణ విలువలు Peter Jackson ఏర్పరచిన రాచబాటలో హృద్యంగా ముందుకు సాగుతున్నాయి. The Lord of the Rings Trilogy కాలానికి ఇప్పటికి పెరిగిన సాంకేతికత కూడా ఈ సిరీస్ కి ఒక వరం.

యువ Galadriel గా Morfydd Clark నటన చాలా బాగుంది. ఈ పాత్ర కోసం ఆమె పడిన కష్టాన్ని అభినందించాలి. ఆమె Tolkien సాహిత్యాన్ని, Peter Jackson చిత్రాల్ని లోతుగా అధ్యయనం చేసింది. Cate Blanchett లాంటి గొప్ప నటి చేసిన పాత్రను చేస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం, మెప్పించడం సాధారణమైన విషయం కాదు. 








SHAMBHALA - The Mystic Land


Sriram had written, produced and directed a high budget 12 part mystical thriller Television Series
named ‘SHAMBHALA - The Mystic Land’, based on his extensive research on ancient buddhist scriptures. The technically path breaking and critically acclaimed series was broadcasted on prestigious Gemini TV, biggest Television Channel in Telugu States, as 'Sunday 8.30 Primetime Mega Series'.


 





పరమ గీతం - కవితాసంపుటి 


'పరమ గీతం' పుస్తకం ప్రతుల కోసం సంప్రదించండి @ +91 8519863664(Whatsapp)

MRP: ₹ 250 (Free Shipping only in India)




తీవ్రవాద దర్శకురాలు జూలియా ద్యుకోన్రన్న్యూ

 
జూలియా ద్యుకోన్రన్న్యూను తీవ్రవాద దర్శకురాలు అని ఎందుకు అంటున్నానంటే ఆమె అంతటి తీవ్రతతో ఏ దర్శకురాలూ సినిమాని తీయడాన్ని మనం ఎప్పుడూ చూడలేదు.

2021 సంవత్సరానికే shocking and disturbing film గా పేరుగాంచిన చిత్రం Titane కి దర్శకురాలు ఒక మహిళ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మహిళా దర్శకులకు తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం రావడం, తమ vision ని ఇంత శక్తివంతంగా వ్యక్తీకరించే అవకాశం రావడం చాలా అరుదు.

దర్శకురాలు Julia Ducournau ప్రతిభకే కాదు, ఆమె ధైర్యానికి కూడా మనం విస్మయం చెందుతాం. 2016 లో అనేక ప్రశంసలు పొందిన ఈమె చిత్రం RAW చూసినప్పుడూ ఇలాగే ఆశ్చర్యానికి లోనయ్యాను. ఈ ఐదేళ్ళలో ఆమె ఎంతగానో పరిణితి చెందారు.

ఈ చిత్రం Cannes అత్యుత్తమ పురస్కారం అయిన Palme d'or ని గెలుచుకోవడం జరిగింది. ప్రతిభావంతురాలైన న్యూజీలాండ్ కి చెందిన దర్శకురాలు Jane Campion తరువాత Palme d'or అందుకున్న ద్వితీయ మహిళ ఈమె. అలాగే solo గా Palme d'or ని అందుకున్న మొదటి మహిళ కూడా ఈమే. Jane Campion ‘Piano’ చిత్రానికిగాను చీనా దేశపు అత్యుత్తమ దర్శకులలో ఒకరైన Chen Kaige తో Palme d'or ని పంచుకున్నారు. Chen Kaige(Farewell to My Concubine) Palme d'or అందుకున్న మొదటి చీనా దేశస్తుడు. అంతేకాదు Titane చిత్రం లెక్కకుమించిన పురస్కారాలు గెలుచుకుంది. ఫ్రాన్స్ దేశం తరపున ఆస్కార్స్ కి పంపబడింది.

తొలి చిత్రమైనా Agathe Rousselle అసాధారణమైన నటనకి, మనమెంతో ఇష్టపడే ఫ్రెంచి నటుడు Vincent Lindon మొక్క సాత్వికమైన, శాంతమైన మూర్తిమత్వం తోడైన ఫలితంగా ఒక అసాధారణమైన ఫలితం వచ్చింది. దానిని మీరు స్వయంగా అనుభూతి చెందాల్సిందే.

సున్నిత హృదయులు ఈ మె చిత్రాలు చూడకుండా ఉంటే మంచిది. చిత్రంలోని గొప్ప కళాత్మకతని అనుసరించగలిగినవారు మాత్రమే చూడండి. 



అతిథి గృహం


మానవ జీవితమొక అతిథి గృహం
అనుదినమొక అపరిచిత అతిథి

సంతోషం
నైరాశ్యం
నీచత్వం
అరుదుగా
క్షణమాత్రపు ఎరుక
అనుకోని అతిథులు

అతిథులెవరైనప్పటికీ
ఆహ్వానించు
గౌరవించు

విలయకాలపు గాలులవలె
నీ ఇంటిలోని సర్వాన్ని
ధ్వంసం చేసి
ఊడ్చుకుపోయే
దుఃఖపు సమూహాలయినప్పటికీ
వారిని గౌరవించు

వారు నిన్ను రిక్తం చేసేది
అనాహ్వానిత శాంతి కోసం కావచ్చు

ఒక నల్లని ఆలోచనో
లేదా,
అవమానకరమైనదో
మలినమైనదో
నీ వాకిలిలో
నిలుచున్నప్పుడు
నవ్వుతూ లోనికి
ఆహ్వానించడానికి
సంకోచించకు

నీ ఇంటికి ఎవరు వచ్చినా
వారి పట్ల కృతజ్ఞతగా ఉండు
ఎందుకంటే
ప్రతి అతిథి
నీకు మార్గనిర్దేశనం చెయ్యడానికే
అనంతత్వం నుండి
పంపబడతాడు

మూలం: రూమి
అనుసృజన, చిత్రం: శ్రీరామ్ 

 


మిమురో పర్వతం, తత్సుతా వాగు 

తుఫానులు

ఎప్పుడూ
మిమురో పర్వతాన్ని
ఆక్రోశంతో
ఫెళఫెళారావాలతో
ఆక్రమిస్తోనే ఉంటాయి

తత్సుతా వాగులో
మేపిల్ ఆకులు
దట్టంగా చెదిరిపడి ఉంటాయి
పట్టువస్త్రంపై
ఎర్రని జలతారులా

మూలం: నగయసు తచిబన
అనుసృజన, ఛాయాచిత్రం : శ్రీరామ్


కాల్పనికలోక స్రష్ట టోకైన్
 

ఇంగ్లీష్ భాషలో J. R. R. Tolkien వచనం విశిష్టమైన, అసాధారణమైన శిల్పాన్ని కలిగి ఉంటుంది. అనేక భాషల మాధుర్యాన్ని తన హృదయంలోకి ఇంకించుకున్న Tolkien అయా భాషల సారాన్ని, వైశిష్ట్యాన్ని, సౌందర్యాన్ని ఆసాంతం ఇంగ్లీషులో పలికించాడు. ఇంగ్లీష్ భాషని పునర్నిర్మించాడు.

సాంప్రదాయ సాహిత్యవేత్తలు unprofessional writer అని, భాషని ధ్వంసం చేసినవాడని నిందించి, ద్వేషించే అతని భాషలోని దైవత్వం ముందు ప్రపంచం మ్రోకరిల్లింది.

ప్రాచీన పరిమళాన్ని తనలో నింపుకున్న అత్యంత ఆధునికమైన sophisticated భాష ఆయనది. ఆయన తన రచనల్లో పదాలు ఉపయోగించినట్టుగా ఇంకెవరూ ఉపయోగించలేరనేది అందరూ ఒప్పుకునే విషయం. మరి ఆయన పదాలకి, వాక్యాలకి అంతటి శక్తి ఎలా వస్తోంది? పదాలను నిపుణతతో ఉపయోగించిన విధానం వల్ల ఆయన వాక్యాలకు అంతటి శక్తి వస్తోందా?

అణువులోని పరమాణువుల్లా అత్యంత ఖచ్చితత్వంతో వాక్యంలో ప్రకంపించే ఆయన ఉపయోగించిన పదాల ఎంపిక, అక్షరాల అమరిక లేదా వాటి ధ్వని లక్షణం వల్ల ఆ సౌందర్యం వస్తోందా? లేదా ఆయన హృదయంలో నుండి నేరుగా ఆ శక్తి ప్రసరిస్తోందా?

గొప్ప భాషా శాస్త్రవేత్తలకు, పండితులకు సాధ్యం కానిది ఆయనకు ఎలా సాధ్యమైంది? ఆయన పదాల ఎంపికకు ఆధారమేంటి? ఆయన అంత గొప్ప wordsmith ఎలా అయ్యారు?

శక్తివంతమైన కవితాత్మకత ఆయన వాక్యాలకు జీవస్థానంగా ఉంటుంది. విసుగు పుట్టించే వాడుకలో ఉన్న సాహిత్య ధోరణులు, శైలులు, ప్రశస్తమైనవిగా భావించబడుతున్న, ప్రస్తుతింపబడుతున్న,
శ్లాఘించబడుతున్న సర్వామోద వాక్య నిర్మాణవిధానాలకు ఆయన అతీతుడు. ఆయన వాక్యాల, పదాల సముద్భవం తీక్షణమైన సృజనాత్మక క్షేత్రాల నుండి ఉద్భవిస్తుంది.

ఆయన ఒక స్వాప్నికుడు, హృదయ జీవి. ఎంతో సరళమైన, కవితాత్మకమైన, శక్తివంతమైన ఆయన భాష వెనుక ఉన్నది ఆయన నైపుణ్యం కాదు. ఒక కాల్పనిక ఊహా ప్రపంచంలోకి పలాయితుడై జీవిస్తూ ఆయన గడిపిన దయనీయమైన బాల్యపు ఒంటరితనం. తల్లి మరణం, మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా ఆయన చూసిన, ఎదుర్కొన్న క్రూరమైన ఘటనలు, ప్రాణం పెట్టుకున్న స్నేహితులను కోల్పోయిన గాయాలు. వాటి నొప్పి.

భాషకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది. నైపుణ్యంలో నుంచి రాదు. పాండిత్యం నుండి రాదు. అది వేదన నుండి వస్తుంది. లోలోపలి ఊట బావి యొక్క చెమ్మ నుండి వస్తుంది. వ్యక్తిలోని నమ్రత నుండే సరళమైన భాష జనిస్తుంది. Tolkien యొక్క నిసర్గమైన వాక్యాలకు అత్యంత శక్తివంతమైన భావం అంతర్లీనంగా పునాదిగా ఉంటుంది. ఆ వెలుగే అతని వాక్యాలలో ప్రకాశిస్తుంది.

మంత్రోచ్ఛారణలా, సంగీత స్వరాల్లా ఎంతో ఖచ్చితత్వంతో, కవితాత్మకంగా పలికే ఆయన పదాలు అతనిదైన ఒక ఐతిహాసిక ప్రపంచంలోకి మనల్ని లాక్కెళ్ళిపోతాయి. ఒకసారి అతని కాల్పనిక జగత్తులోకి ప్రవేశించాక, ఆ జగత్ మనలో కలిసిపోతుంది. మృత్యువు వరకు మనతోనే ఉండిపోతుంది.

మహాభారతం అంతటి శక్తి గల ఆధునిక ఇతిహాసాలను సృజించిన Tolkien యొక్క ఊహా ప్రపంచపు మాయాజాలం మనల్ని పూర్తిగా తనలోకి కరిగించేసుకుంటుంది.

40 ఏళ్లు రచయితగా ఒకే వస్తువు పై ఆయన పనిచేశారు. అదే ఆయన సృష్టించిన తనదైన అపూర్వ కాల్పనిక ప్రపంచం Middle Earth.
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ చూసినవారికి, హాబిట్ లాంటి Tolkien రాసిన పుస్తకాలు చదివిన వారికి మనం జీవిస్తున్న ప్రపంచం పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది, కొత్త రంగులతో, కొత్త కాంతితో.

ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యయంతో(8000 కోట్లు) Amazon Prime Video రూపొందించిన టెలివిజన్ సిరీస్ The Lord of the Rings: The Rings of Power తెలుగుతో సహా ప్రపంచంలోని అత్యధిక భాషలలో విడుదల అయింది.

మహా ఐతిహాసకుడు J. R. R. Tolkien యొక్క కాల్పనిక జగత్తులో మనం మరోసారి తప్పిపోదాం.

 

 


పరమ మార్గం 

అభిప్రాయాల ఉచ్చులో చిక్కుకోనివారికి

పరమ మార్గమేమంత కష్టంకాదు

రాగద్వేషాలపట్ల ఉదాశీనతగలవారికి సర్వమూ విదితమవుతుంది


భూమ్యాకాశాలనడుమ దూరం అనంతమైనా

నీవు ఏకత్వాన్ని దర్శించగలవా?

సత్యం ఆవిష్కృతమవాలంటే

నిశ్చితమైన అభిప్రాయాలను విడనాడు


ఇష్టాయిష్టాల భేదభావం మానసిక అస్వస్థతకు చిహ్నం

విషయాల పరమార్థాన్నిగ్రహించలేనివారి

మనసులోని శాంతి చెదిరిపోతుంది


అనంతమైన చోటులో

ఏదీ లోపించనట్టుగానూ

ఏదీ అతిశయించనట్టుగానూ

మార్గం విస్పష్టంగా ఉంది

ఎంపిక, తిరస్కారాల మూలంగా

మనం విషయాల యదార్థ తత్వాన్ని గ్రహించలేకున్నాము


ఐహిక విషయాల చిక్కుల్లో జీవించవద్దు

అలాగే అంతరిక భావాల శూన్యతలోనూ జీవించవద్దు

ఏకత్వంలో నిశ్చలంగా నిలచిఉండు


పరమమార్గంలో జీవించడం

అంత సులభంకాదు

అలాగని కష్టమూ కాదు

కాని నిశ్చితాభిప్రాయాలు గలవారికది భీతావహం...అగమ్యగోచరం


వేగంగా పయనించాలని ఆతృతపడేవారు నిజానికి నెమ్మదిగా పయనిస్తారు

వారిని బంధనాలు బాధిస్తాయి

ఆఖరికి నిర్వాణమనే భావనపట్ల మమకారాన్ని పెంచుకోవడం కూడా

నిన్ను దారి తప్పేలాచేస్తుంది


Poet: Wu Pen (Chia Tao,779-841)

అనుసృజన, ఛాయాచిత్రం: శ్రీరామ్



 పిల్లంగ్రోవి


నా పిల్లంగ్రోవిని
బల్లపై ఉంచాను
సోమరిగా మృదు అనుభూతుల
జ్ఞాపకాలలోకి జారుకున్నాను

నేనెందుకు పిల్లంగ్రోవిని వాయించాలి?
రంధ్రాల గుండా ప్రసరించే చల్లగాలి
దానికదే గానంచేస్తోంది

Poem: Hsueh-Feng Yi Ts'un (821-906)
అనుసృజన, ఛాయాచిత్రం : శ్రీరామ్ 


వాక్కు

పాండిత్య ప్రకర్షను ప్రదర్శించాలని కోరుకొనేవారు
వ్యర్థంగా సూత్రాలను వల్లెవేయడం చూసాను
సూత్రాలలోని పదాల పై ఆధారపడడం చూసాను

వారి నోరు చరిస్తుంది, హృదయం నిద్రిస్తుంది
నోరు, హృదయం వాదులాడుకుంటాయి
హృదయం యొక్క సహజ స్థితి సమరసభరితమైనదయినప్పటికీ ఏమి ఫలం?

కేవలం పదాలలో చిక్కుకోకండి
మీ సహజ స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి
అన్యమైనదేదీ మీ హృదయాన్ని ఆక్రమించుకోకుండా జాగరూకులై ఉండండి
అప్పుడే మీరు మీ వాక్కుకి అధికారి అవుతారు

పరిపూర్ణమైన ఎరుకలో
బహిరమైనది
ఆంతరికమైనది
అనబడే వేర్పాటు తొలగిపోతుంది

మూలం: Han Shan(c 730)

అనుసృజన, ఛాయాచిత్రం : శ్రీరామ్


 


 

చషకం

పుష్పాల
నడుమ
చషకం
మిత్రులులేని నేను
మధుపాత్రను ఎత్తి
చందమామను పిలిచాను
నా నీడతో సహా
ముగ్గురం మిత్రులం
మూలం: లి పో (701-762)
అనుసృజన, ఛాయాచిత్రం: శ్రీరామ్

Saturday 3 December 2022

నగరపు ఆత్మ  

అతడు నగరం యొక్క అశాంతితో కుతకుతలాడే ఆత్మని అనుభూతి చెందాడు, 

దాని అంతఃకుహరపు ప్రతి కదలికకు, 

అలజడికి అతడు శ్రధ్ధగా స్పందించాడు. 

విష సర్పపు వేయి శిరస్సుల కదలికలోని అంధకార సౌందర్యాన్ని 

అంతఃనేత్రంతో దర్శించాడు. 

బడబడమని కరుకు శబ్దాలు చేసే యంత్రాల గుబులుని అతడు విన్నాడు.

అతడు నగరపు అలమటించే రోదనను విన్నాడు. అది అతని దేహంలో భాగంగా మారిపోయింది.

ఒక్క శబ్దాన్నీ వదలకుండా ఆతడు నగరాన్ని, దాని కల్మష సౌందర్యాన్ని విన్నాడు, చూసాడు, అనుభూతి చెందాడు.

ఒంటరితనంతో ఇప్పుడు అంతా నగరమే, ప్రతి చోటు ఒక నగరమే.

ఆ ఒంటరి ప్రేమికుడి దిగులు పరిమళంలా నగరమంతా పరివ్యాప్తమై విస్తరించింది. 


ఆలస్యంగా నిద్రపోయిన ప్రజల చేతనను దక్షిణపు గాలిలా వేకువ జామున స్వస్థపరచడానికి ప్రయత్నించింది.

[Ritual(2000) (Japan) చిత్రాన్ని చూసాకా నాకు కలిగిన అనుభూతిని ఇలా రాసుకున్నాను]


అవధి లేని చోటు

నేను నీ నుండి
ఆశించేదేమీ లేదు
గాలి పడమర దిశకు
మళ్ళినప్పుడెప్పుడైనా
అరుదుగా
తృప్తి-ఆనందాలతో
విస్ఫోటనం చెందిన
నీ నవ్వులు
తరంగాలుగా
లీలగా
నా చెవిని తాకుతుంటాయి

అప్పుడు
విప్పార్చిన కళ్ళతో నవ్వే
నీ ముఖం
నా మనోఫలకంపై
స్పష్టాతిస్పష్టంగా
ద్యోతకమవుతుంది
దూరపు భవంతిలో
చివరి అంతస్తులో
తెరల వెనుక
ఎప్పుడైనా
నీ ఆకృతి ఛాయలా, భ్రమలా
కదులుతూ కనిపిస్తుందనే
ఆశతో
నేను నిత్యం
రెప్పలు మూయకుండా
ఎదురు చూస్తుంటాను

రాత్రి నిశ్శబ్దంలో
నీ ఇంటి ఎదుట
తమాల వృక్షపు నీడల్లో
రేయిరేయంతా నిలబడి
హాయిగా నిదురిస్తున్న
నీ మెత్తని శ్వాసని వింటున్నట్టు
అనుభూతి చెందుతాను

తిరునాళ్ళలో
నిన్ను చూడడం కోసం
ఏడాదంతా ఎదురు చూస్తాను -
నీ భర్తతో, పిల్లలతో ఆనందంగా తిరిగే
నిన్ను చూడడం కోసం
నేను నీ నుండి ఆశించేదేమీ లేదు
అందుచేతనే
నా ఆనందానికి అవధి లేదు
నా దుఃఖానికి కూడా

Poem & Art : Sriram