Thursday 20 September 2012

గ్రహాంతరవాసి పెయింటింగ్


అనుభవం ఆవిరైపోతుంది
జ్ఞాపకం చప్పబడిపోతుంది
జీవితమూ ఒక రోజు చల్లబడిపోతుంది

వెనుకకి తిరిగి చూస్తే

నడచివచ్చిన రహదారంతా
మాయమై ఉంటుంది

అంతుచిక్కని మార్మిక పొగమంచు...

అందని ఆకాశం క్రింద
కాలి క్రింది నేల కూడా కంపిస్తూ ఉంటుంది
కాస్తోకూస్తో నువ్వు నమ్మగలిగేది ఆ నేలని మాత్రమే
అదీ మాయమైన రోజున ఏది మిగులుతుందో జీవితానికి?

నిన్ను నువ్వే నమ్మలేవు

నీతోనే నీకు రాద్ధాంతం
నువ్వెవరో నీకే తెలియదు
స్వల్పమైన ఎరుక గల మరమనిషివి నీవు
ఆ ఎరుకని కూడా నమ్మలేవు
లైఫ్ ఈజ్ అన్సెర్టినిటీ
జీవితమొక అనిశ్చిత మేఘం
నిగూఢ నక్షత్ర ధూళి
గ్రహాంతరవాసి పెయింటింగ్


Digital Art : Sriram

జ్ఞానానుభవం



మూడు పగళ్ళు – మూడు రాత్రులు
ఏకధాటిగా పనిచేసినప్పుడు
పగలూ రాత్రీ వేరు కాదని తెలుసుకున్నాను ...
కాల స్వరూపంలో విభజనలేని స్థితిని అనుభవించాను

ఏడు పగళ్ళు – ఏడు రాత్రులు
జ్వరపీడిత గాఢ సుషుప్తిలో
గడిపినప్పుడు
మానవ చేతనను అతి పలుచనిదిగా, అతి బలహీనమయినదిగా గుర్తించాను
జీవితం మరణం ఒకటేనని గ్రహించాను

పౌర్ణమి వెన్నెలలో వెండి సముద్రపు అనంత సౌందర్యంలో
కాలాతీతమైన దానిని క్షణమాత్రంగా దర్శించినప్పుడు
సృష్టికి అభేదంగా నా ఉనికి కరిగిపోవడాన్ని గమనించాను

కాని
ప్రతి జ్ఞాన శకలం తామరాకు మీది నీటి బిందువులా
హృదయానికి అంటకుండా ఎందుకు జారిపోయిందో
ఎంత ఆలోచించినా తెలుసుకోలేకపోయాను

చాలా ఏళ్ళు గడిచాకా, వృద్ధాప్యంలో ఒక రోజు
నాలో జ్ఞానపు ముసుగులో రహస్యంగా దాగివున్న అజ్ఞానిని చూసాను
అతన్ని తొలిసారిగా నగ్నంగా చూసాను
నిస్సిగ్గుగా దాక్కొని ఉన్న అతన్ని చూసాను
అతన్ని చూడకుండా జీవితాన్నంతా జ్ఞాన శోధన అని నేను భావించిన దాని కోసం
ఎలా వ్యర్ధం చేసుకున్నానో తెలుసుకొని విలపించాను

ఇదే నా తొలి జ్ఞానానుభవం

Photograph:P.S.Zolla