Sunday 4 December 2022


కాల్పనికలోక స్రష్ట టోకైన్
 

ఇంగ్లీష్ భాషలో J. R. R. Tolkien వచనం విశిష్టమైన, అసాధారణమైన శిల్పాన్ని కలిగి ఉంటుంది. అనేక భాషల మాధుర్యాన్ని తన హృదయంలోకి ఇంకించుకున్న Tolkien అయా భాషల సారాన్ని, వైశిష్ట్యాన్ని, సౌందర్యాన్ని ఆసాంతం ఇంగ్లీషులో పలికించాడు. ఇంగ్లీష్ భాషని పునర్నిర్మించాడు.

సాంప్రదాయ సాహిత్యవేత్తలు unprofessional writer అని, భాషని ధ్వంసం చేసినవాడని నిందించి, ద్వేషించే అతని భాషలోని దైవత్వం ముందు ప్రపంచం మ్రోకరిల్లింది.

ప్రాచీన పరిమళాన్ని తనలో నింపుకున్న అత్యంత ఆధునికమైన sophisticated భాష ఆయనది. ఆయన తన రచనల్లో పదాలు ఉపయోగించినట్టుగా ఇంకెవరూ ఉపయోగించలేరనేది అందరూ ఒప్పుకునే విషయం. మరి ఆయన పదాలకి, వాక్యాలకి అంతటి శక్తి ఎలా వస్తోంది? పదాలను నిపుణతతో ఉపయోగించిన విధానం వల్ల ఆయన వాక్యాలకు అంతటి శక్తి వస్తోందా?

అణువులోని పరమాణువుల్లా అత్యంత ఖచ్చితత్వంతో వాక్యంలో ప్రకంపించే ఆయన ఉపయోగించిన పదాల ఎంపిక, అక్షరాల అమరిక లేదా వాటి ధ్వని లక్షణం వల్ల ఆ సౌందర్యం వస్తోందా? లేదా ఆయన హృదయంలో నుండి నేరుగా ఆ శక్తి ప్రసరిస్తోందా?

గొప్ప భాషా శాస్త్రవేత్తలకు, పండితులకు సాధ్యం కానిది ఆయనకు ఎలా సాధ్యమైంది? ఆయన పదాల ఎంపికకు ఆధారమేంటి? ఆయన అంత గొప్ప wordsmith ఎలా అయ్యారు?

శక్తివంతమైన కవితాత్మకత ఆయన వాక్యాలకు జీవస్థానంగా ఉంటుంది. విసుగు పుట్టించే వాడుకలో ఉన్న సాహిత్య ధోరణులు, శైలులు, ప్రశస్తమైనవిగా భావించబడుతున్న, ప్రస్తుతింపబడుతున్న,
శ్లాఘించబడుతున్న సర్వామోద వాక్య నిర్మాణవిధానాలకు ఆయన అతీతుడు. ఆయన వాక్యాల, పదాల సముద్భవం తీక్షణమైన సృజనాత్మక క్షేత్రాల నుండి ఉద్భవిస్తుంది.

ఆయన ఒక స్వాప్నికుడు, హృదయ జీవి. ఎంతో సరళమైన, కవితాత్మకమైన, శక్తివంతమైన ఆయన భాష వెనుక ఉన్నది ఆయన నైపుణ్యం కాదు. ఒక కాల్పనిక ఊహా ప్రపంచంలోకి పలాయితుడై జీవిస్తూ ఆయన గడిపిన దయనీయమైన బాల్యపు ఒంటరితనం. తల్లి మరణం, మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా ఆయన చూసిన, ఎదుర్కొన్న క్రూరమైన ఘటనలు, ప్రాణం పెట్టుకున్న స్నేహితులను కోల్పోయిన గాయాలు. వాటి నొప్పి.

భాషకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది. నైపుణ్యంలో నుంచి రాదు. పాండిత్యం నుండి రాదు. అది వేదన నుండి వస్తుంది. లోలోపలి ఊట బావి యొక్క చెమ్మ నుండి వస్తుంది. వ్యక్తిలోని నమ్రత నుండే సరళమైన భాష జనిస్తుంది. Tolkien యొక్క నిసర్గమైన వాక్యాలకు అత్యంత శక్తివంతమైన భావం అంతర్లీనంగా పునాదిగా ఉంటుంది. ఆ వెలుగే అతని వాక్యాలలో ప్రకాశిస్తుంది.

మంత్రోచ్ఛారణలా, సంగీత స్వరాల్లా ఎంతో ఖచ్చితత్వంతో, కవితాత్మకంగా పలికే ఆయన పదాలు అతనిదైన ఒక ఐతిహాసిక ప్రపంచంలోకి మనల్ని లాక్కెళ్ళిపోతాయి. ఒకసారి అతని కాల్పనిక జగత్తులోకి ప్రవేశించాక, ఆ జగత్ మనలో కలిసిపోతుంది. మృత్యువు వరకు మనతోనే ఉండిపోతుంది.

మహాభారతం అంతటి శక్తి గల ఆధునిక ఇతిహాసాలను సృజించిన Tolkien యొక్క ఊహా ప్రపంచపు మాయాజాలం మనల్ని పూర్తిగా తనలోకి కరిగించేసుకుంటుంది.

40 ఏళ్లు రచయితగా ఒకే వస్తువు పై ఆయన పనిచేశారు. అదే ఆయన సృష్టించిన తనదైన అపూర్వ కాల్పనిక ప్రపంచం Middle Earth.
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ చూసినవారికి, హాబిట్ లాంటి Tolkien రాసిన పుస్తకాలు చదివిన వారికి మనం జీవిస్తున్న ప్రపంచం పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది, కొత్త రంగులతో, కొత్త కాంతితో.

ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యయంతో(8000 కోట్లు) Amazon Prime Video రూపొందించిన టెలివిజన్ సిరీస్ The Lord of the Rings: The Rings of Power తెలుగుతో సహా ప్రపంచంలోని అత్యధిక భాషలలో విడుదల అయింది.

మహా ఐతిహాసకుడు J. R. R. Tolkien యొక్క కాల్పనిక జగత్తులో మనం మరోసారి తప్పిపోదాం.

 

No comments:

Post a Comment