Thursday 19 January 2017

ఒక పథికుని స్మృతుల నుండి…




ఒక భయంకర తుఫాను రాత్రి

తలదాచుకొనేందుకు ఏ చోటూ కానక

నీ వాకిట్లో నిలుచున్నాను



నీవు దయతో నీ గుడిసెలోనికి ఆహ్వానించావు



పథికుడా! ఇంత రాత్రివేళ ఎక్కడకు నీ ప్రయాణం?” అని ప్రశ్నించావు

నేను మౌనంగా ఉండిపోయాను.



వెచ్చదనం కోసం నెగడు రాజేస్తూ

రాత్రంతా నీవు మేలుకొనే ఉన్నావు



నేనప్పుడప్పుడూ పిడుగుల శబ్దానికి మేల్కొని

కనులు తెరచినప్పుడు

నీ వదనం ఎర్రటి మంట వెలుగులో

విచారభారితంగా ఉంది



నీ పెదవులు నెమ్మదిగా, అస్పష్టంగా కదులుతున్నాయి



వర్షపు హోరులో నాకేమీ వినిపించలేదు

తుఫాను మందగించింది

నిశ్శబ్దం ఆవరించింది



అపుడు నీ పాటలో నేవిన్న చివరి రెండు వాక్యాలూ నాకింకా గుర్తే

హృదయంలో పొంగిపొరలే ప్రేమను ఎవరికర్పించను?….

….తోటలో పూచిన ఏకైక గులాబీని ఎవరికి కానుకీయను?


తెల్లారేకా ఎర్రబడిన నీ కళ్ళలో కన్నీళ్లను చూసాను

నేను వెళతానని చెప్పినప్పుడు

అవి జలజలరాలాయి

చెప్పాలనుకున్నదేదో నీ గొంతుదాటి బయల్పడలేదు



వెళుతూ వెళుతూ వెనక్కి చూసినప్పుడు

నీవు మోకాళ్ళ పై కూలబడి రోదిస్తున్నావు



కవిత మరియు డిజిటల్ ఆర్ట్ : శ్రీరామ్
(సారంగ సాహిత్య పత్రికలో ప్రచురితం) 



No comments:

Post a Comment