Friday 20 January 2017

కవిత్వం శిల్పం 

కొత్తదనానికి మొహం చిట్లించుకొనే గుణం చాలామందిలో ఉంటుంది. Certificate లేకుండా ఒక కొత్త విషయం యొక్క గొప్పతనాన్ని గుర్తించే శక్తి చాలా తక్కువమందికి ఉంటుంది. ప్రశంసా పత్రాన్నిచ్చే శక్తి, స్వచ్ఛతా, పెద్దమనసు మనలో చాలా కొద్దిమందికే ఉంటుంది. ఎంతో నిర్మలమైన మనసు ఉన్న వారే కొత్తదనాన్నిఆస్వాదించి, ఆనందించి, ప్రేమించి, యోగ్యతని అప్రయత్నంగా లోకానికి ప్రకటించగలుగుతారు. ఇటువంటి ప్రకటనల మూలంగా ప్రజలు కొత్త కవుల గొప్పతనాన్ని గ్రహించి(దురదృష్ట వశాత్తూ ఎక్కువమంది తమంతట తాముగా దేనినీ గుర్తించలేరు), వారిని స్వీకరించగలుగుతారు. లేదంటే గుర్తింపు లభించని ప్రతిభావంతులైన కవులు కవిత్వం కోసం జీవితాన్ని వెచ్చించేందుకు అవసరమైన moral support దొరకక లౌకికత్వంలోకో లేదా ఏకాంతంలోకో నిష్క్రమిస్తారు. సాహిత్యంలో ఆ లోటు ఎవరూ పూడ్చలేనిది. మంచి కవుల్ని ప్రోత్సహించకుండా నాణ్యమైన కవిత్వం రావడం లేదని విమర్శించడం వల్ల సాహిత్యానికి ఏం మేలు జరుగుతుంది? ఒక గొప్ప కవిని సమాజం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కాని Spontaneous గా ఒక విషయంలోని గొప్పదనాన్ని గుర్తించే అంతరికశక్తి, గుర్తించినా అంగీకరించగల ఉన్నతత్వం, అంగీకరించగలిగినా ప్రకటించగల ధైర్యం కొద్దిమందికే ఉంటాయి. చాలా మంది ప్రతిభావంతులైన కొత్త కవులకి తగిన గౌరవం లభించడం లేదు. ఎదిగిన వ్యక్తి ఎప్పుడూ ప్రపంచానికి ఒక నిచ్చెనగా నిలవాలి. అది బాధ్యతగా కాకుండా ప్రేమగా చేయగలగాలి. 

 పక్షులు పాడినట్లుగా సహజంగా, సునాయాసంగా కవిత్వం రాయాలంటే హృదయాన్ని అనుభవానికి వశం చేయాలి. నియమనిబంధనల్ని, జ్ఞానభారాన్ని విడిచిపెట్టాలి. తెలిసిందంతా విడిచిపెట్టాలి. అనుభూతి techinic ని ఎంచుకుంటుంది. దానిలో తగినంత గాఢత ఉన్నప్పుడు, తనంతట తానుగా జ్ఞాన శకలంగా నిలువగల బలం దానికి ఉన్నప్పుడూ లేదా అనంతమైన పరిపూర్ణతని క్షణమాత్రంగానైనా స్పర్శించగలిగినప్పుడూ అది తన స్వంత techinic ని సృజించుకోగలదు. అనుభూతిలో తగినంత గాఢత లోపించినప్పుడు intellect ఆ ఖాళీలను పూరించడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి స్థితిలో కవిత్వం రాయకుండా ఉండడం మంచిదని నా ఉద్దేశ్యం. కవిత్వంలో మేధస్సు పాత్రని పెంచి సాహిత్యాన్ని పెద్ద కార్ఖానాగా మార్చారు ఎందరో కవులు. ఎండిపోయిన హృదయం నుండి అమృతాన్ని పిండాలని ప్రయత్నించి మేధస్సుకు పెద్దపీట వేసారు. ఆ విధంగా భావంతో కాకుండా పదవిన్యాసాలతో ఆనందించడం మొదలుపెట్టారు. నియమనిబంధనల్ని సృష్టించారు. ఆత్మ ఎప్పుడూ సరళంగానే పలుకుతుంది. అది పలికినప్పుడు ఎప్పుడూ ఒక కొత్త రీతిలో గానం చేస్తుంది. దానికి ఇన్నిన్ని ఉపకరణాలు అవసరంలేదు. గొప్ప కవిత్వాన్ని సృష్టించాలని ఆశపడేవారు సరళమైన జీవితాన్ని జీవించాలి. జీవితానికి, కవిత్వానికి దూరం పెరిగినప్పుడు హృదయంతోకాక, మనసుతో కవిత్వాన్ని రాయాల్సిన పరిస్థితి వస్తుంది. వట్టిపోయిన పొదుగు నుండి బలవంతంగా కవిత్వాన్ని పిండాలని ప్రయత్నించేకంటే జీవిత ప్రవాహాన్ని సహజంగా గమనిస్తూ జీవించడం మేలు. జీవితాన్ని అనుసరించిన వారి హృదయాన్ని కవిత్వం అప్రయత్నంగా కావలించుకొంటుంది. పద్మం వికసించే రోజు కోసం ఓర్పుగా వేచిఉండాలి. కవి ప్రతిదినం కవిత్వం రాయవలసిన అవసరం లేదు. ఆత్మని పలికించేవి జీవితం మొత్తం మీద ఒక డజను కవితలని రాసినా చాలు. రబియా ఎన్ని కవితలు రాసింది? జీవితంతో కాక సాహిత్యంతో మాత్రమే సంబందం పెట్టుకున్నవారు పదాల సాలె గూడులో చిక్కుకుంటారు. మరికొందరు యవ్వనకాలంలో సహజంగా ప్రజ్వలించిన జ్వాల ఆరిపోయాకా మిగిలిన పొగని నేర్పుగా ఉపయోగిస్తూ సహజ జ్వాల అన్నట్టుగా ఇతరుల్ని భ్రమింపజేయగలుగుతారు. ఎలా అంటే జీవితమంతా శ్రమించి ఒక శక్తివంతమైన techinic ని అభివృద్ది చేసుకుంటారు, తమ మేధస్సుతో, శ్రమతో. వారి అవగాహనాలేమిని, confusionని, అజ్ఞానాన్ని అందమైన పదాలను నేర్పుగా పేర్చి authentic భావనని కలిగించగలుగుతారు. దురదృష్టవశాత్తూ వారి కౌశలానికి మనమూ ఎన్నో సార్లు మోసపోతాము.

Sketching నిజాయితీపరులకు మిగిలివున్న ఏకైక మార్గం. అది ఒకొక్కసారి ఓమాదిరి మంచి ఫలితాలని ఇస్తుంది. అయితే తగినంత అంతరిక శక్తి లోపించినప్పుడు, ఐహిక ప్రపంచంతో దీర్ఘకాలంగా interaction కొనసాగించినప్పుడూ బాహ్య చేతనలో ఏర్పడే disturbance లేదా జడత్వం కవి యొక్క ఈ అసహాయ స్థితికి కారణం అని భావిస్తున్నాను. ఇప్పుడే లోపలి చైతన్యాన్ని, బాహ్య చైతన్యం అడ్డుకుంటుంది. ఇటువంటి సమయంలో కవి రాయకుండా ఏకాంతంలోకి నిష్క్రమించడం మంచిదని నా భావన. తిరిగి pure passion సహజంగా సంభవించే వరకు వేచివుండడం మేలు. గొప్ప కావ్యాలు రాయడం కోసం ఎంతో మంది యూరోపియన్ కవులు పల్లెప్రాంతాలలో నెలల తరబడి ఏకాంతంగా జీవించిన సంగతి మనకు తెలిసిందే. మనలోపలి కుతకుతని బలవంతపు మూసల్లోకి ఒంపకుండా యదాతధంగా, సహజంగా విడిచిపెట్టగలితే, ఎరుకతో గమనించగలిగితే, ఒక సరియైన సమయానికి ఆ కుతకుతలోంచే అమృతం పెల్లుబుకుతుంది. అందుకు artistic greed ని మనం విడిచిపెట్టాలి. కవి రాయడానికి సిద్ధపడ్డట్లే రాయకుండా జీవితాన్ని అనుసరించడానికి కూడా సిద్ధపడాలి.


కవిత్వాన్ని రాయడం కంటే, గొప్ప కళను సృజించడం కంటే సృజనాత్మకంగా జీవించడం ఎంతో కష్టమైనది. అలా జీవించగలిగినప్పుడు హృదయంలోని గానం ఎప్పుటికీ మూగబోదు.

No comments:

Post a Comment