Thursday 19 January 2017

వెల్కమ్ (2009) : దారికాని దారులలో 





“I knew a boy who tried to swim across the lake,
It’s a hell of a thing to do,
They say the lake is as big as the ocean,
I wonder if he knew about it”
                              -Yoko Ono (lyrics slightly modified)


నిజజీవిత కథ ఆధారంగా రూపొందించబడిన “వెల్‌కమ్” చిత్రాన్ని చూడడం ఒక హృదయవిదారకమైన అనుభవం. చూసాక, మన ప్రపంచాన్ని మనం ఇన్ని ముక్కలుగా చేసుకున్నందుకు ఎంతో సిగ్గుపడతాము. దేశాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు, ధనికులు, పేదలు_ ఇన్ని విధాలుగా మనం మన ప్రపంచాన్ని విడగొట్టుకున్నందుకు మనిషిగా అవమాన భారంతో కుమిలిపోతాము. ఎల్లప్పుడూ డబ్బు, అధికారం, కీర్తి వెంబడి పరుగులు తీసే మనం, జీవిత పరమార్థం మరియు జీవితానందానికి ఆధారం అయిన మానవ సంబంధాలని ఎంతలా విస్మరిస్తాము?
వెల్‌కమ్” చిత్రం చరిత్ర కాదు, వర్తమానం. గతంలో మనుషులు ఇంత క్రూరంగా ఉండేవారని సరిపెట్టుకొనే అవకాశాన్ని ఇది ఇవ్వదు. హిట్లర్ ఎంతో క్రూరుడు, మనం కాదు అని తప్పించుకొనే అవకాశాన్నీ ఇవ్వదు. ఇది ఇప్పటి కథ. నేటి అమానవీయ గాధ. దీనికి మనమందరం బాధ్యులం. ఈ ప్రపంచం ఇప్పుడు ఉన్నట్టుగా ఉండడానికి మనమందరం బాధ్యులం. ఈ సమాజాలు ఇంకా primitive stage కొనసాగడానికి మనమందరం బాధ్యులమే. ఎందుకంటే మనమే ఈ ప్రపంచం కాబట్టి.

ఇరాక్ కు చెందిన 17 ఏళ్ల కుర్దిష్ కుర్రవాడయిన బిలాల్ కయాని ప్రియురాలు మినా కుటుంబం బ్రిటన్ కి వలసపోతుంది. మినా తండ్రి బలవంతంగా ఆమె మేనమామతో వివాహాన్ని నిశ్చయిస్తాడు. బిలాల్ కల్లోల పరిస్థితులతోనూ, నిరంతర హింసతోనూ నిండివున్న ఇరాక్ లోని ఒక పేద కుటుంబానికి చెందినవాడు. అతడు ఎలాగైనా మినా వివాహ తేదీకి ముందుగా లండన్ చేరుకోవాలని, రహస్యంగా ఆమెని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. కాని ఎలా? అతని వద్ద డబ్బులేదు, వీసా లేదు, పాస్ పోర్ట్ లేదు.
బిలాల్ యూరోప్ గుండా 4000 కి.మీ. కాలినడకన ప్రయాణించి ఫ్రాన్స్ లోని కాలియస్ పట్టణాన్ని చేరుకుంటాడు. అక్కడి ఫ్రెంచ్ ప్రభుత్వం కుర్దిష్ శరణార్థులకు స్థానికుల నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా కఠిన చట్టాలను రూపొందించింది. శరణార్ధులకు దుకాణాలలో ఆహారం, వస్తువులు అమ్మకుండా నిషేధాజ్ఞలు విధించింది. ఎవరైనా స్థానికులు వారికి ఆహారం పెట్టినా, ఆశ్రయం కల్పించినా అరెస్ట్ చేయబడతారు. అలాగే స్థానిక ప్రజలు కూడా వారిని పురుగులవలె హీనంగా చూస్తుంటారు. వారిని clandestines పేరుతో అవమానకరంగా సంబోధిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డు మార్గం ద్వారా ఒక ట్రక్కులో అక్రమంగా ఇంగ్లాండ్ చేరాలని చేసిన ప్రయత్నంలో బిలాల్ ఫ్రెంచ్ పోలీసులకు దొరికిపోతాడు.

నిస్పృహకులోనైన బిలాల్ గత్యంతరంలేని స్థితిలో, english channelను ఈది ఇంగ్లాండ్ చేరాలనే అసంభవమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. స్థానికుడైన సైమన్ క్లామెట్ ని ఈత పాఠాలు నేర్పించవలసిందిగా అభ్యర్ధిస్తాడు. దయతో అతడిని ఆదరించి, ఆశ్రయం కల్పించిన సైమన్ కు స్థానికుల నుండి తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది. వారు పోలీసులకు పిర్యాదు చేస్తారు. హఠాత్తుగా అర్థరాత్రి, సైమన్ ఇంటి నుండి మాయమైన బిలాల్, మైనస్ డిగ్రీల చలిలో english channelని ఈదాలని ప్రయత్నించి ఇంగ్లాండ్ తీరానికి అతిచేరువలో ఇంగ్లీష్ కోస్ట్ గార్డ్ లకు కనిపిస్తాడు. వారిని తప్పించుకొనే ప్రయత్నంలో సముద్రంలో మునిగి మరణిస్తాడు.

సైమన్ ముందు ప్లాస్టిక్ సంచిని పోలీసులు తెరుస్తారు. అందులో బిలాల్ మృతదేహం ఉంటుంది. వివాహ సమయంలో  ప్రియురాలు మినా చేతికి తొడగాలని బిలాల్ తన వెంట తెచ్చుకున్న ఉంగరాన్ని, సైమన్ ఇంగ్లాండ్ తీసుకువెళ్ళి మినాకు ఇస్తాడు. ఆ ఉంగరాన్ని దాచుకోవడానికి తనకంటూ ఈ లోకంలో ఒక చోటులేదని చెపుతూ మినా సైమన్ కు తిరిగి ఇచ్చివేస్తుంది. ఆ మరుసటి రోజే మినాకు మేనమామతో వివాహం.
ఈ చిత్రాన్ని చూసాక భారమైన, వ్యధాకులిత హృదయంతో ఈ క్రింది వాక్యాలు రాసుకున్నాను.

“Why do you astray
My friend?
In those unwelcoming lands,
Where no one treats you,
As a human.
I know it is for the love of your life.”



Film: Welcome (2010)
Director : Philippe Lioret
Cast : Vincent Lindon, Firat Ayverdi, Audrey Dana, Olivier Rabourdin, Derya Ayverdi
Country : France
Duration : 110 min

No comments:

Post a Comment