Wednesday, 12 April 2023
Monday, 19 December 2022
అవతార్ 2 - ఒక ధ్యానానుభవం
జేమ్స్ కెమెరాన్, టెరెన్స్ మాలిక్ లాగా
గొప్ప తాత్వికుడు కాదు, జాంగ్ ఇమో లాగా గొప్ప టెక్నీషియన్ కాదు,
పీటర్ జాక్సన్ లాగా సహజ కళాకారుడూ కాదు. గతంలో
కాస్త నాణ్యత గల మాస్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ చిత్రాలు తీసిన దర్శకుడు మాత్రమే.
గొప్ప సామర్థ్యాలు పుట్టుకతో వరంగా లభించని ఓమాదిరి దర్శకుడు మాత్రమే. అయితే అతడు
మాస్టర్ గా ఎలా ఎదిగాడు?
టెరన్స్ మాలిక్ వలె కెమెరాన్ 20 ఏళ్ళు అరణ్యాలలోకి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఏకాంతంలో
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేదు. మరి అతడిలో spiritual inclination ఎందుకు, ఎలా కలిగిందో చెప్పడం కష్టం. బహుశా
అతడిలోని తీవ్రమైన జిజ్ఞాస, అంకితభావం, ప్రకృతి పట్ల అతనికి ఉన్న ప్రేమ అతడిలోని పరిణతకు కారణం
కావచ్చు. టైటానిక్ తర్వాత, ఇంకా చెప్పాలంటే అవతార్-1 లో, అతని కళలో కనిపించిన గొప్ప spiritual quality ని గమనించి ఆశ్చర్యపోయాను. ఒక జీవితంలో ఇంత గొప్ప ఎదుగుదల ఎలా సాధ్యం
అనే ఆశ్చర్యం కలిగింది.
అవతార్-2 లో ధ్యానాత్మకమైన visuals లో, ఆ దృశ్యధారలో టెరెన్స్ మాలిక్ ముద్రను మనం చూస్తాం. జేమ్స్ కెమెరానే కాదు
ఆధునిక దర్శకులలో masters ఎవరూ టెరెన్స్ మాలిక్ ప్రభావం నుండి
తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే మాలిక్ గురువు. జ్ఞాని. అందరికీ.
అవతార్-2 సాధారణమైన కథే కావచ్చు. కానీ సాధారణమైన అనుభవం మాత్రం కాదు. సౌందర్య
శక్తిని, ప్రకృతితో మనకున్న deep
connection ని, spiritual connection ని లోతుగా అనుభవించేటట్టుగా, pristine and lucid visual తో, అవి visuals కాదు, మనం ఒక ఒక చేపలాగానో లేదా ఒక తిమింగలంలాగోనో ఒక జన్మని జీవించడం.
సరిగ్గా ఒక కొత్త, మహత్తర లోకంలో జన్మని ఎత్తి ఒక జీవితాన్ని
జీవించిన గొప్ప అనుభవాన్ని ఇస్తుంది ఈ చిత్రం.
మేధస్సును ఉపయోగించకుండా సౌందర్యానికి,
అనుభూతికి
వశ్యులైతే చాలు. అదే అర్హత. అది ఒక్కటే. మీకు పండోరా లోకపు దివ్య కాంతి అనుభూతమవుతుంది.
సున్నితమైన అతిలోక వర్ణాలు మీలోకి ఇంకిపోతాయి. నిజానికి కేమెరాన్ దృష్టిలో పండోరా అంటే సరిగ్గా
మనం జీవిస్తున్న, నాశనం చేసుకుంటున్న మన భూమే. పండోరా అంటే ఈ భూమిని ఎంత అందంగా,
ఎంత పవిత్రంగా, ఎంత సున్నితంగా మనం చూడాలో, ఈ భూమిపైన ప్రతి జీవరాశితోను మనం ఎటువంటి ప్రేమాస్పదమైన సంబంధాన్ని
కలిగివుండాలో, అలాగే ఏ జీవి మనకు భిన్నమైనది
కాదనీ- ఈ లోకం, ఈ లోకంలోని సర్వజీవులూ, నువ్వూ-నేనూ ఒకటేననీ, వేరు కాదనీ - ఒక
బలమైన, స్థిరమైన, శక్తివంతమైన అనుభవంగా మన హృదయాల్లో ఒక దర్శనంగా ఆవిష్కృతం కావడం.
పండోరా ఒక ఆదర్శ లోకపు నమూనా కాదు. మనం జారవిడుచుకున్న సత్యం.
ఈ చిత్రాన్ని ఒక కథగా చూసే వాళ్లకు కథ మాత్రమే కనిపిస్తుంది. విమర్శనాత్మక కోణంలో చూసేవాళ్లకు లోపాలు కనిపించవచ్చు. ఒక అనుభవంగా చూసే వాళ్లకు ఇది ఒక కాలాతీతమైన సత్యం. ఆది, అంతం లేని ప్రకృతిలో మనం ఉనికి లేకుండా కరిగిపోవడం. ఒక అమలిన ఆధ్యాత్మిక అనుభవం.
కెమెరూన్ అవతార్ ని ఎంచుకున్నదే ప్రకృతిని
కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని, ఇప్పటికే సమయం మించి పోయింది అనే
విషయాన్ని బలంగా ప్రజల హృదయాల్లోకి చొప్పించాలని నిర్ణయించుకోవడం వల్లనే జరిగింది.
అందువల్లనే అతను వేరే ప్రాజెక్టుల్ని పక్కనపెట్టి అవతార్ ని వీలైనన్ని ఎక్కువ భాగాలుగా
తీయాలని తపిస్తున్నాడు. గొప్ప శక్తి, గొప్ప బాధ్యతను ఇస్తుంది. అత్యంత శక్తివంతమైన,
ప్రభావంతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టే తన ఉనికి కారణమైన ప్రకృతిని కాపాడుకోవాలని
నిబద్ధతతో ప్రయత్నిస్తున్నాడు. చాలా మంది అనుకుంటున్నట్టు అవతార్ franchise ని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం కెమెరాన్ కి లేదు.
మేధోపరమైన చర్చలకు ఆస్కారం లేకుండా సూటిగా, సరళంగా అందరికీ
- ఇక్కడ అందరికీ అంటున్నానంటే నిజంగానే ఈ భూమిపై జీవించే అందరికీ -
అర్థ మయ్యేంత సరళ మైన భాషలో కెమెరాన్ సందేశం అందించగలిగాడు. అవతార్ ని న్యూయార్క్
నుండి విశాఖ అడవుల్లోని మారుమూల గూడెం గిరిజనుల వరకూ ప్రతి ఒక్కరూ చూస్తారు.
ప్రేమిస్తారు. ఎందుకు? వారికి ఏదో అర్థమవుతుంది, అందాల్సింది అందుతుంది, రహస్య సందేశం.
Monday, 5 December 2022
మరపు
నువ్వు నా నుండి
దూరమైనప్పుడల్లా
నేను చెయ్యగలిగింది
ఏముంది
ఇంకొంచెం నీకు
దూరమవడం తప్ప
నేను దూరమైనప్పుడల్లా
నువ్వు ఎలాగూ ఇంకొంత
దూరమవుతావు
నేను దగ్గరవ్వాలనుకున్నప్పుడల్లా
మరింత దగ్గరతనాన్ని కోల్పోతావు
అందుచేతనే
నేను దగ్గరవడం కంటే
దూరమవడం కోసం
ప్రయత్నించడంలోనే
నీకు ఎక్కువ దగ్గరవుతున్నట్టు
అనుభూతి చెందుతారు
చివరికి
మనం
ఒకరికొకరం
ఎంతగా దూరమైపోతామంటే
ఒకప్పుడు
మనం కలిసి ఉన్నామన్న
విషయమే
మర్చిపోయేంతగా
కాని ఆ మరపు
వరంగా
మనలో
ఒక్కరికే లభిస్తుంది
కవిత, చిత్రం: శ్రీరామ్
Sunday, 4 December 2022
Curse of Mundane
సాహసనారి లేడీ గలాద్రియెల్
ప్రపంచవ్యాప్తంగా Galadriel పాత్ర పట్ల Trolls విరుచుకుపడుతున్నారు. Trolls దాడిని తట్టుకోలేక అమెజాన్ ప్రైమ్ వీడియో తన comments service ని కొన్ని రోజులు పాటు మూసివేసింది. పెద్ద ఎత్తున జాతి విద్వేషపూరిత దాడులు social media లో ఒక విషతుల్యమైన వాతావరణాన్ని సృష్టించాయి.
The Lord of the Rings Trilogy, The Hobbit Trilogy లలో Cate Blanchett నటించిన Lady Galadriel పాత్ర కు సరిసాటిగా The Rings of Power లోని Morfydd Clark నటించిన యువ Galadriel పాత్ర లేదని విమర్శిస్తున్నారు.
ఎలాన్ మస్క్ అయితే Galadriel తప్ప The Rings of Power లోని పురుషులందరూ వెన్నెముక లేనివారు లేదా పిరికివారు అని tweet పెట్టాడు. వ్యాపారంలో జెఫ్ బెజోస్ తో ఉన్న శత్రుత్వం దానికి కారణం కావచ్చు. ప్రత్యర్థి అయిన ఆపిల్ సంస్థను కూడా అటువంటి ట్వీట్లతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం ఎలాన్ మస్క్ కి అలవాటే.
Calmness అనేది చాలా expensive thing. ఒకరు స్థితప్రజ్ఞత సాధించడం ఎన్నో ఎదురుదెబ్బలు, పొరపాట్లు, ఓటముల తరువాతే జరుగుతుంది. అపరిపక్వతలో సంభవించే చేదు ఫలితాల్ని చవిచూసాకే పరిపక్వత లభిస్తుంది. Lady Galadriel స్థితప్రజ్ఞత, దివ్యత్వం, composed and matured persona ఒక్క రోజులో రాలేదు.
Galadriel పాత్ర పట్ల ప్రేమ Tolkien కి 40 ఏళ్ల సుదీర్ఘ రచనా కాలంలో పెరుగుతూ వచ్చింది, అలాగే Tolkien యొక్క స్వీయ పరిపక్వత కూడా. అది Galadriel వ్యక్తిత్వంలో ప్రతిఫలించింది, ఎన్నో వందల సంవత్సరాలు జీవించిన ఆమె అనుభవ జ్ఞానం అది.
అలాగని యువ Galadriel కి Lady Galadriel కి నడుమ contradiction లేదా అంటే ఖచ్చితంగా ఉంది. నిజాయితీతో కూడిన adacity నుండి calmness లోకి సాగించే ప్రయాణమే Galadriel పాత్ర.
ఇక ఎలాన్ మస్క్ విషయానికి వస్తే జీవితంలో ప్రతి ఒక్కరికీ వారు నిర్వహించాల్సిన పాత్ర ఒకటి ఉంటుంది అని Tolkien's philosophy చెబుతుంది. ఎవరి పాత్రను వారు అత్యుత్తమంగా సర్వశక్తులను వినియోగించి నిర్వహిస్తేనే జీవన సాఫల్యం అంటుంది.
అందరూ Galadriel కాలేరు. ఎలాన్ మస్క్ కాలేరు. జీవితం కాని, కథ కాని అలా ఉండదు. ఒక ఎలాన్ మస్క్ పాత్ర ఎందరో వ్యక్తుల శ్రమతో ఏర్పడింది. ఒక శ్రామికుడు లేదా సైనికుడి కష్టం రాజు కష్టం కన్నా తక్కువ కాదు. ఎవరి పాత్రను వారు నిర్వహిస్తేనే సృష్టిలో సమతులిత అంటుంది Tolkien సాహిత్యం.
Tolkien యొక్క ప్రపంచంలో అనేక జాతుల వారు ఉమ్మడి లక్ష్యం కోసం తమ వంతు పాత్రను తాము నిర్వహిస్తారు. అదే fellowship కి అర్థం. ఇక్కడ racism కి తావే లేదు.
దర్శకుడు Peter Jackson కి మాత్రమే సాధ్యంకాగల కళాత్మక మాధుర్యంతో ఇతిహాస స్థాయిని అందుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అతను తన బాల్యం నుండి Tolkien యొక్క కాల్పనిక సాహిత్య ప్రపంచంలోకి పలాయితుడై, దానినే శ్వాసిస్తూ ఎదిగిన మహా కళాకారుడు. అయితేనేం The Rings of Power విజయవంతంగా Middle Earth ఆత్మని నిలుపుకోగలిగింది. సంగీతం, దర్శకత్వం, నిర్మాణ విలువలు Peter Jackson ఏర్పరచిన రాచబాటలో హృద్యంగా ముందుకు సాగుతున్నాయి. The Lord of the Rings Trilogy కాలానికి ఇప్పటికి పెరిగిన సాంకేతికత కూడా ఈ సిరీస్ కి ఒక వరం.
యువ Galadriel గా Morfydd Clark నటన చాలా బాగుంది. ఈ పాత్ర కోసం ఆమె పడిన కష్టాన్ని అభినందించాలి. ఆమె Tolkien సాహిత్యాన్ని, Peter Jackson చిత్రాల్ని లోతుగా అధ్యయనం చేసింది. Cate Blanchett లాంటి గొప్ప నటి చేసిన పాత్రను చేస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం, మెప్పించడం సాధారణమైన విషయం కాదు.
SHAMBHALA - The Mystic Land
![]() |
తీవ్రవాద దర్శకురాలు జూలియా ద్యుకోన్రన్న్యూ
ఈ చిత్రం Cannes అత్యుత్తమ పురస్కారం అయిన Palme d'or ని గెలుచుకోవడం జరిగింది. ప్రతిభావంతురాలైన న్యూజీలాండ్ కి చెందిన దర్శకురాలు Jane Campion తరువాత Palme d'or అందుకున్న ద్వితీయ మహిళ ఈమె. అలాగే solo గా Palme d'or ని అందుకున్న మొదటి మహిళ కూడా ఈమే. Jane Campion ‘Piano’ చిత్రానికిగాను చీనా దేశపు అత్యుత్తమ దర్శకులలో ఒకరైన Chen Kaige తో Palme d'or ని పంచుకున్నారు. Chen Kaige(Farewell to My Concubine) Palme d'or అందుకున్న మొదటి చీనా దేశస్తుడు. అంతేకాదు Titane చిత్రం లెక్కకుమించిన పురస్కారాలు గెలుచుకుంది. ఫ్రాన్స్ దేశం తరపున ఆస్కార్స్ కి పంపబడింది.
సున్నిత హృదయులు ఈ మె చిత్రాలు చూడకుండా ఉంటే మంచిది. చిత్రంలోని గొప్ప కళాత్మకతని అనుసరించగలిగినవారు మాత్రమే చూడండి.
అతిథి గృహం
మానవ జీవితమొక అతిథి గృహం
అనుదినమొక అపరిచిత అతిథి
సంతోషం
నైరాశ్యం
నీచత్వం
అరుదుగా
క్షణమాత్రపు ఎరుక
అనుకోని అతిథులు
అతిథులెవరైనప్పటికీ
ఆహ్వానించు
గౌరవించు
విలయకాలపు గాలులవలె
నీ ఇంటిలోని సర్వాన్ని
ధ్వంసం చేసి
ఊడ్చుకుపోయే
దుఃఖపు సమూహాలయినప్పటికీ
వారిని గౌరవించు
వారు నిన్ను రిక్తం చేసేది
అనాహ్వానిత శాంతి కోసం కావచ్చు
ఒక నల్లని ఆలోచనో
లేదా,
అవమానకరమైనదో
మలినమైనదో
నీ వాకిలిలో
నిలుచున్నప్పుడు
నవ్వుతూ లోనికి
ఆహ్వానించడానికి
సంకోచించకు
నీ ఇంటికి ఎవరు వచ్చినా
వారి పట్ల కృతజ్ఞతగా ఉండు
ఎందుకంటే
ప్రతి అతిథి
నీకు మార్గనిర్దేశనం చెయ్యడానికే
అనంతత్వం నుండి
పంపబడతాడు
మూలం: రూమి
కాల్పనికలోక స్రష్ట టోకైన్
ఇంగ్లీష్ భాషలో J. R. R. Tolkien వచనం విశిష్టమైన, అసాధారణమైన శిల్పాన్ని కలిగి ఉంటుంది. అనేక భాషల మాధుర్యాన్ని తన హృదయంలోకి ఇంకించుకున్న Tolkien అయా భాషల సారాన్ని, వైశిష్ట్యాన్ని, సౌందర్యాన్ని ఆసాంతం ఇంగ్లీషులో పలికించాడు. ఇంగ్లీష్ భాషని పునర్నిర్మించాడు.
సాంప్రదాయ సాహిత్యవేత్తలు unprofessional writer అని, భాషని ధ్వంసం చేసినవాడని నిందించి, ద్వేషించే అతని భాషలోని దైవత్వం ముందు ప్రపంచం మ్రోకరిల్లింది.
ప్రాచీన పరిమళాన్ని తనలో నింపుకున్న అత్యంత ఆధునికమైన sophisticated భాష ఆయనది. ఆయన తన రచనల్లో పదాలు ఉపయోగించినట్టుగా ఇంకెవరూ ఉపయోగించలేరనేది అందరూ ఒప్పుకునే విషయం. మరి ఆయన పదాలకి, వాక్యాలకి అంతటి శక్తి ఎలా వస్తోంది? పదాలను నిపుణతతో ఉపయోగించిన విధానం వల్ల ఆయన వాక్యాలకు అంతటి శక్తి వస్తోందా?
అణువులోని పరమాణువుల్లా అత్యంత ఖచ్చితత్వంతో వాక్యంలో ప్రకంపించే ఆయన ఉపయోగించిన పదాల ఎంపిక, అక్షరాల అమరిక లేదా వాటి ధ్వని లక్షణం వల్ల ఆ సౌందర్యం వస్తోందా? లేదా ఆయన హృదయంలో నుండి నేరుగా ఆ శక్తి ప్రసరిస్తోందా?
గొప్ప భాషా శాస్త్రవేత్తలకు, పండితులకు సాధ్యం కానిది ఆయనకు ఎలా సాధ్యమైంది? ఆయన పదాల ఎంపికకు ఆధారమేంటి? ఆయన అంత గొప్ప wordsmith ఎలా అయ్యారు?
శక్తివంతమైన కవితాత్మకత ఆయన వాక్యాలకు జీవస్థానంగా ఉంటుంది. విసుగు పుట్టించే వాడుకలో ఉన్న సాహిత్య ధోరణులు, శైలులు, ప్రశస్తమైనవిగా భావించబడుతున్న, ప్రస్తుతింపబడుతున్న,
శ్లాఘించబడుతున్న సర్వామోద వాక్య నిర్మాణవిధానాలకు ఆయన అతీతుడు. ఆయన వాక్యాల, పదాల సముద్భవం తీక్షణమైన సృజనాత్మక క్షేత్రాల నుండి ఉద్భవిస్తుంది.
ఆయన ఒక స్వాప్నికుడు, హృదయ జీవి. ఎంతో సరళమైన, కవితాత్మకమైన, శక్తివంతమైన ఆయన భాష వెనుక ఉన్నది ఆయన నైపుణ్యం కాదు. ఒక కాల్పనిక ఊహా ప్రపంచంలోకి పలాయితుడై జీవిస్తూ ఆయన గడిపిన దయనీయమైన బాల్యపు ఒంటరితనం. తల్లి మరణం, మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా ఆయన చూసిన, ఎదుర్కొన్న క్రూరమైన ఘటనలు, ప్రాణం పెట్టుకున్న స్నేహితులను కోల్పోయిన గాయాలు. వాటి నొప్పి.
భాషకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది. నైపుణ్యంలో నుంచి రాదు. పాండిత్యం నుండి రాదు. అది వేదన నుండి వస్తుంది. లోలోపలి ఊట బావి యొక్క చెమ్మ నుండి వస్తుంది. వ్యక్తిలోని నమ్రత నుండే సరళమైన భాష జనిస్తుంది. Tolkien యొక్క నిసర్గమైన వాక్యాలకు అత్యంత శక్తివంతమైన భావం అంతర్లీనంగా పునాదిగా ఉంటుంది. ఆ వెలుగే అతని వాక్యాలలో ప్రకాశిస్తుంది.
మంత్రోచ్ఛారణలా, సంగీత స్వరాల్లా ఎంతో ఖచ్చితత్వంతో, కవితాత్మకంగా పలికే ఆయన పదాలు అతనిదైన ఒక ఐతిహాసిక ప్రపంచంలోకి మనల్ని లాక్కెళ్ళిపోతాయి. ఒకసారి అతని కాల్పనిక జగత్తులోకి ప్రవేశించాక, ఆ జగత్ మనలో కలిసిపోతుంది. మృత్యువు వరకు మనతోనే ఉండిపోతుంది.
మహాభారతం అంతటి శక్తి గల ఆధునిక ఇతిహాసాలను సృజించిన Tolkien యొక్క ఊహా ప్రపంచపు మాయాజాలం మనల్ని పూర్తిగా తనలోకి కరిగించేసుకుంటుంది.
40 ఏళ్లు రచయితగా ఒకే వస్తువు పై ఆయన పనిచేశారు. అదే ఆయన సృష్టించిన తనదైన అపూర్వ కాల్పనిక ప్రపంచం Middle Earth.
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ చూసినవారికి, హాబిట్ లాంటి Tolkien రాసిన పుస్తకాలు చదివిన వారికి మనం జీవిస్తున్న ప్రపంచం పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది, కొత్త రంగులతో, కొత్త కాంతితో.
ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యయంతో(8000 కోట్లు) Amazon Prime Video రూపొందించిన టెలివిజన్ సిరీస్ The Lord of the Rings: The Rings of Power తెలుగుతో సహా ప్రపంచంలోని అత్యధిక భాషలలో విడుదల అయింది.
మహా ఐతిహాసకుడు J. R. R. Tolkien యొక్క కాల్పనిక జగత్తులో మనం మరోసారి తప్పిపోదాం.









